30, మార్చి 2016, బుధవారం

స్త్రీలవ్రతకథలు - తవుడుగౌరి నోము కథ


తవుడుగౌరి నోము కథ

ఒక భాగ్యశాలి ఎనుబది ఏళ్ళ వృద్ధురాలై ఉన్నప్పటికీ ఆమె అత్తమామలనూ , తల్లితండ్రులనూ, బంధువులనూ , బిడ్డలనూ ఎడబాయక సంతోషముగానుండెను. ఆమెను చూసి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ " ఏమి నోచితివమ్మా ! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో ఉన్నావు" అని అడుగగా?  " అమ్మలారా! ఇది వాయనమందిన నోము ఫలమే కాని , నోచిన ఫలము కాదు. పూర్వము మాయమ్మ తవుడు గౌరి నోము నోచుకొని నాకు వాయనము ఇచ్చినది. ఇది అంతయూ వాయనపు చలవే అని చెప్పెను. " అది విని వారు వాయనమందితేనే ఇంత ఫలము చెందగా నోము నోచినచో ఇంకెంత ఫలము అబ్బునో కదా అని అనుకొని నాటినుండీ ఆ నోము నోచుకొనుచూ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యములతో విలసిల్లుచుండిరి. ఈకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
తవ్వ నిండుగా బియ్యము పోసి పైన కొద్దిగా తవుడుతో కప్పి , చీరతోనో లేక రవికెలగుడ్డతోనో పుణ్యస్త్రీకి వాయనమీయవలెను.

స్త్రీలవ్రతకథలు - కైలాసగౌరి నోము కథ

కైలాసగౌరి నోము కథ

ఒక రాజుకు ఒక్కతే కుమార్తె కలదు. అతడు ఆమకు ఒక వన్నెల విసనకఱ్ఱ వంటి వయారి మగనిని ఏరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైననూ చూడకుండెను. అందుకే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినమూ పూజించుచూ , అతనిని తనతో కలపమని ప్రార్థించుచుండెను. అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమెయందు కరుణించి ఒక నాటి రాత్రి ఆమె స్వప్నములో కనబడి కైలాసగౌరి నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తరువాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి ఆనోమును నోచుకొనెను. తరువాత ఆమె భర్త ఆమె యందు అనురాగము కలవాడై వేశ్యానుబంధమును వదులుకొనెను. అప్పటినుండీ వారిరువురూ పార్వతీపరమేశ్వరులవలే జంట విడువక సుఖముగానుండిరి. 

ఉద్యాపన:
పండుగ దినమున పార్వతీ దేవాలయము నందు లేక నదీతీరమునందు ఐదు కుంచముల కుంకుమ , ఐదు కుంచముల పసుపు , పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలెను. పంచిపెట్టునపుడు మాట్లాడరాదు.

స్త్రీలవ్రతకథలు - కాటుకగౌరి నోము కథ


కాటుకగౌరి నోము కథ
ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను. ఆ త్రోవన పోవుచున్న పార్వతీదేవి"   ఏమమ్మా  విచారించుచున్నావు? "  అని అడిగెను . అందుకు ఆమె " అమ్మా నీవెవరివో తెలిసికొనుటకు నాకు  కండ్లు లేవు.  గ్రుడ్డిదానను , నన్ను చూచి అందరూ నవ్వుచున్నారు. ఆ బాధలు పడలేక ఇట్లు వచ్చితిని. ఇక్కడకు వచ్చిననూ నీవెవరో నన్ను పరామర్శించుచున్నావు. గ్రుడ్డిదాననగు నాకు సర్వము గ్రుడ్డిదిగనే తోచుచున్నది. ఇరుగు పొరుగు గ్రుడ్డి ,మగడు గ్రుడ్డి , అంతా గ్రుడ్డి అని అన్నారు. " పార్వతీదేవి నవ్వుకొని నీవు పూర్వము కాటుకగౌరి నోము పట్టి ఉల్లంఘన చేయుటచే నీకీ జన్మలో ఇట్టి కష్టము వచ్చెను. ఇప్పుడా నోము నోచినచో నీకు దృష్టి వచ్చునని వెడలిపోయెను. ఆమె తడుముకొని ఇంటికి వచ్చి నోము నోచుకొని దృష్టిని పొందగలిగెను.

ఉద్యాపన:
నోము పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాదిపాటు అక్షతలు వేసుకొనవలెను. సంవత్సరం పూర్తయిన తరువాత ఒక పుణ్యవతికి తలంటి నీళ్ళుపోసి , చీర , రవికెలగుడ్డ , కాటుకతో బరిణి , దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను.

29, మార్చి 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు - అక్షయబొండాల నోము కథ

అక్షయబొండాల నోము కథ

శ్లో: అక్షయ బొండాల నోము నవలంబించి లక్షలాదిగ
       పశుగణముతో రమ్యజీవితముతోడ లక్షణముల కుప్పయై,
        లావణ్య రేఖయై , అక్షయ లోకాలందుకొను నతివి,
        అని యనుకొని అక్షతలు వేసుకొని , ప్రతి దినము ఐదు పసుపు ముద్దలను ఐదుగురు పుణ్యస్త్రీలకు ఇవ్వవలయును , అట్లు ఏడాది చేసి ఉద్యాపన చేసుకొనవలెను.

  ఉద్యాపన:
ఐదు కొబ్బరి బొండాలు, పసుపు, కుంకుమ , రవికెలగుడ్డ ఐదుగురు పుణ్యాంగనలకు వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు - అంగరాగాల నోము కథ

అంగరాగాల నోము కథ

శ్లో:అంగరాగాల నోము నోచిన యతివలకు అనంత సంపదలు
      అమితానందాలు అధిక గౌరవాలు , అనురాగ దాంపత్యాలు
       అనుకున్న సంపదలు అక్షయలోకాలు ప్రాప్తించును.
ఉద్యాపన:
ఐదు బొట్టుపెట్టెలలో కాటుక కాయలు , కుంకుమ భరిణిలు , నల్లపూసలు, దువ్వెనలు , అత్తరులు , అగరువుండలు పెట్టి ఐదుగురు పడుచులకు వాయనమియ్యవలెను, కథ తప్పినను వ్రతము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - మూసివాయనాలనోము కథ

మూసివాయనాల నోము కథ

మూసివాయనాలనోమునోచిన ముదితకు ముద్దుముచ్చటలు తీరును. ముత్తయిదువ తనము నిలుచును . మోక్షప్రాప్తికలుగును . ఈ మాటలనుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన:
పసుపు కుంకుమ, నల్లపూసలు , గాజలు , పువ్వులు , పండ్లు , ఆకులు ఆరు చేటల నిండుగ పోసి , పైన ఒక్కొక్క చేటను బోర్లించి ఒక్కొక్క మూసివాయనము దక్షిణ తాంబూలములతో ఆరుగురు ముత్తయిదువుల కివ్వవలెను, వాయనములు చిన్న చేటలతో నైనా యివ్వవచ్చును. ఆరు వారములు, ఆరు సార్లుఇచ్చిన నివ్వవచ్చును.

స్త్రీలవ్రతకథలు - చిక్కుళ్ళగౌరి నోము కథ

చిక్కుళ్ళగౌరి  నోము కథ

శ్లో  : ఎత్తిన బిడ్డను యెడబాయకుండ , కడుపు చలువను కడబెట్ట
కుండ, కాంతుని యెడబాటు కలుగకుండంగ చేయవో అమ్మా!
చిక్కుళ్ళగౌరి! వెండి చిక్కుళ్ళ వాయనాలిచ్చెదను   బంగారు
చిక్కుళ్ళు పంచిపెట్టెదను , సిరిసంపదల నిమ్ముచిక్కుళ్ళగౌరి

అని యనుకొని, యేడాది  పొడుగున అక్షతలు వేసుకొని పిమ్మట ఉద్యాపనము చేసుకొనవలెను.

   ఉద్యాపన :
   ఒక స్త్రీకి తలంటి నీళ్ళు పోసి భోజనమునుపెట్టి , చీర రవికెలగుడ్డతో ఒక బంగారు చిక్కుడు పువ్వునుపెట్టి వాయన   మియ్యవలెను.
             

24, మార్చి 2016, గురువారం

స్త్రీలవ్రతకథలు - ఉప్పుగౌరి నోము కథ

ఉప్పుగౌరి నోము కథ

దాకనిండా ఉప్పుపోసిన తనువు చాలించేవరకు ఐదవతనము ఉండును .  ఈ మాటలు అనుకొని ఏడాది పొడుగునా అక్షతలు వేసుకొనవలెను. సంవత్సరము నిండిన తరువాత ఉద్యాపన చేసుకొనవలెను.


ఉద్యాపన:

క్రొత్త దాకలో(కుండలో) తొమ్మిది సోలల ఉప్పు పోసి రవికలగుడ్డ వాసినకట్టి , దక్షిణ తాంబూలములతో ముత్తైదువుకు ఇవ్వవలెను.  కథ తప్పిననూ వ్రతము తప్పరాదు.

స్త్రీలవ్రతకథలు - ములగగౌరి నోము కథ

ములగగౌరి నోము కథ

శ్లో|| ములగ పేరెత్తరాదు ములగను చూపించరాదు ములగనీడ నిలువరాదు
        ములగను అంటరాదు ములగనోట బెట్టరాదు.

మాఘ పూర్ణిమ నాడైననూ , రధసప్తమి నాడైననూ పై మాటలు అనుకొని అక్షతలు వేసుకోవలెను.ఇది ఏడాది పాటు చేయవలెను. ములగనోమును  నోచిన ముదితకు ముచ్చటలన్నియు తీరును.

ఉద్యాపన:
సంవత్సరము పూర్తయిన తరువాత ఉద్యాపన చేసుకొనవలెను. 12 మంది ముత్తైదువులను పిలిచి ఒక్కొక్క ముత్తైదువునకు పన్నెండేసి జతల ములగ కాడలను , లక్కజోడు , నల్లపూసల కోవ జతలను ,  దక్షిణ తాంబూలములతో వాయనము ఇవ్వవలెను. పద్ధతి తప్పిననూ ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - గడపగౌరి నోము కథ

                                        గడపగౌరి నోము కథ

గడపగౌరి నోము నోచిన పడతికి గడుపరానంతటి గండములుండవు , గౌరీశంకరుల కరుణకు కొదవుండదు. బడయగ లేనట్టి భాగ్యము లుండవు.అని పఠించి అక్షతలు ధరించవలెను.

విధానము:
 ఒక సంవత్సరము పొడుగునా ప్రతిదినము ఉదయము వేళ ఒక ఇంటి  గడపకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టవలెను , తరువాత ఉద్యాపనము చేయవలెను.

ఉద్యాపన:
పై విధముగా ఒక ఏడాది చేసిన పిమ్మట ఒక పళ్ళెములో  పదమూడు జతల గారెలు , ఒక క్రొత్తచీర , ఒక రవికెల గుడ్డ , మంగళసూత్రాలు , రూపు , మట్టెలు , పసుపు , కుంకుమ ఉంచి దక్షిణ తాంబూలములతో  ఒక  ముత్తైదువుకు  వాయనము ఇవ్వవలెను.

స్త్రీలవ్రతకథలు - కుంకుమగౌరి నోము కథ


కుంకుమగౌరి నోము కథ

ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో బాలవితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయి అగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమికావలెను?  అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండునట్లు  చేయమని ప్రార్థించెను. అప్పుడాలోక జనని" ఓయీ బ్రాహ్మణోత్తమా!  నీ కుమార్తె పూర్వ జన్మమున  కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది , ఇప్పుడు ఆమెచేత ఆ నోము నోయించినచో ఆ కష్టము సంభవించదని " చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి ఆమెచే నోము నోయించి తరవాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉండెను.

ఉద్యాపన:  
పదమూడు భరిణెలనిండా కుంకుమ పోసి , నల్లపూసలు , లక్కజోళ్ళు , దక్షిణ తాంబూలములు పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయనము ఇవ్వవలెను.

20, మార్చి 2016, ఆదివారం

స్త్రీలవ్రతకథలు - కల్యాణగౌరి నోము కథ

                                  కల్యాణగౌరి నోము కథ

కల్యాణ గౌరి నోము నోచిన కలికికి కలుగును , భాగ్యాలు , కలకాల సుఖములు , అనుకొని అక్షతలు వేసుకొనవలెను. ప్రతిరోజు ఒక ముత్తైదువునకు తలదువ్వి్ , బొట్టుపెట్టి పంపవలెను. అట్లు ఒక ఏడు చేసిన తర్వాత ఉద్యాపనము చేసుకొనవలెను.

  ఉద్యాపన:
 
 ఒక పళ్లెములో మట్టెలు, మంగళసూత్రములు, కుంకుమ,పసుపు,గంధము అక్షతలు,పన్నీరు,అత్తరు పూలదండలు,కొత్తకోక,రవికెలగుడ్డపెట్టి పెండ్లిపీటల మధ్యనుండి లేచిన పెండ్లికూతురునకు వాయనము నొసంగవలెను, కథ తప్పినను వ్రతము తప్పరాదు, భక్తి  తప్పకుండిన యెడల ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - వెలగలగౌరి నోము కథ

వెలగలగౌరి నోము కథ

శ్లో: వెలగ వెలగ యనరాదు వెలగపండు తినగరాదు
        వెలగనీడ నిలువరాదు వెలగను వేల చూపరాదు

ఉద్యాపన:

పై మాటలనుకొని అక్షతలు వేసుకొనవలయును. ముచ్చికలతో ఉన్న పదమూడు జతల వెలగకాయలను తెచ్చి పదముగ్గురు పుణ్యస్త్రీలకు లక్కజోళ్ళు , నల్లపూసలు , దక్షిణ, తాంబూలములను పెట్టి వాయన మీయవలెను. కథ లోపమైననూ వ్రత లోపము ఉండరాదు.

స్త్రీలవ్రతకథలు - లక్షపసుపు నోము కథ

                                      లక్షపసుపు నోము కథ

శ్లో:  లక్ష పసుపు నోము పట్టవే తల్లి!
లక్షణముగ సౌభాగ్యమందవే తల్లి!
అక్షయ సౌభాగ్యమందవేతల్లి!
లక్షలవేలేండ్లుగా రాణించవేతల్లి!    
అని అనుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపనము చేసుకోవలెను.

 ఉద్యాపన:
నడుము విరగకుండ నున్న లక్షపసుపు కొమ్ములను ఏరుకొని వాటిని ఇంటిదగ్గర పంచిపెట్టవలెను.దోసెడుకు తక్కువ కాకుండా పంచిపెట్టవలెను. వాటితోబాటు తోచినంత కుంకుమ కూడా ఇవ్వవలెను. ఈ కుంకుమను ముందుగా లక్ష్మికో, గౌరికో పూజ చేసి తరువాత పంచిపెట్టవలెను.

18, మార్చి 2016, శుక్రవారం

స్త్రీలవ్రతకథలు : ఉదయకుంకుమ నోము కథ



ఉదయకుంకుమ నోము కథ

( వివిధ ప్రాచీన/నూతన వ్రతకథల పుస్తకాలనుండి)

ఉదయకుంకుమ నోము పట్టిన ఉవిదయున్న పట్టణమున వెదకినను వెధవలేదు.

విధానము:

ప్రతిరోజూ ఉదయమే శుచియై 2-3 వీధుల చొప్పున ఒక సంవత్సరము పాటు గ్రామంలోని కన్యలకూ , ముత్తైదువులకూ అందరికీ కుంకం బొట్లు పెట్టాలి.అనంతరం సంవత్సరం తరువాత ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపన:

ఒక ముత్తైదువునకు తెల్లవారకుండా తలంటి నీళ్ళుపోసి తానునూ తలంటుకుని నీళ్ళుపోసుకుని చీర , రవికలగుడ్డయు ఆ ముత్తైదువునకు ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టి కుంకుమ భరిణి , దక్షిణ , తాంబూలము లొసంగి ఉద్యాపన చేసికొనవలెను. కథ తప్పిననూ వ్రతము తప్పదు . భక్తి ఉన్న ఎడల ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - గాజుల గౌరి కథ



                                        గాజుల గౌరి కథ  
                                 
ఒక బ్రాహ్మణుని కోడలు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెను చూచి అంతా చిటపటలాడుచుండేవారు. అత్త , మామ , మగడు , ఆడపడచులు , తోటికోడళ్ళు అందరూ ఆమెను చూసి చిటపటలాడుచుండెరివారు. అప్పుడు ఆ చిన్నది విచారిచుచూ అడవిలోకిపోయి తిరుగుచుండెను. అంతట పార్వతీపరమేశ్వరులు భూమిపాలించుటకు వచ్చి , ఆ చిన్నదాన్ని చూచి ఏమి? అలా విచారించుచూ తిరుగుచున్నావు అని అడిగిరి. అందుకు ఆమె ఇరుగు పొరుగు అత్తామామా మగడు నన్ను చూస్తే కోపంగా ఉంటారు . అందుచేత అందరికీ కోపము అయితే ఎట్లు బ్రతకనని ఇలా తిరుగుచున్నానని చెప్పెను. అలా కాదమ్మా ! నీవు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘన చేసినావు . ఆకారణమున నిన్ను చూచిన అందరికీ కోపముగానున్నది. నీవు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారము ఆమె ఇంటికి వెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగా ఉద్యాపన చేసికోగా అప్పటినుండి ఆమె అందరికీ ఇష్టముకలదయ్యెను.

ఉద్యాపన:

ఒక ముత్తైదువును తీసుకుని వచ్చి ఆమెకు ఇష్టమైన గాజులు తొడిగించి , తలంటి నీళ్ళుపోసి , చీర రవికలగుడ్డ ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టవలెను. భక్తి తప్పినా ఫలము తప్పదు. కథ లోపమైననూ వ్రతలోపము కాకూడదు.

స్త్రీల వ్రత కథలు - పసుపు గౌరి నోము కథ



 
పసుపు గౌరి నోము కథ

నూరు పసుపు తోడ నోచిన కాంతకు నూఱు వేలేండ్లు అయిదవతనము. కొట్టు పసుపు నోచిన కాంతకు కోటివేలయేండ్లు అయిదవతనము. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకుని ఏడాది అయిన తరువాత ఉద్యాపన చేయవలెను.

ఉద్యాపన: 
 

మానెడుసోలెడు పసుపు వెదురు పెట్టెలో పోసి రవికలగుడ్డ , దక్షిణ , తాంబూలము , నల్లపూసలు , లక్కజోళ్ళు , కుంకుమ కలిపి ఒక ముత్తయిదువుకి వాయనమీయవలెను. కథ లోపమైన వ్రతలోపము ఉండరాదు.