గండాల గౌరి నోము కథ
ఒక ఊరిలో ఒక రాజుకూతురు ,మంత్రికూతురు గలరు. రాజకూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధముల ఎక్కువైనది. కాని మంత్రి కూతురుకన్న ఘనత ఆమెకు లేదు. మంత్రికూతురు ధన, ధన్యాలకు, దాంపత్యమునుకు, పాడి పంటలకు, మణులవంటి బిడ్డలకు నిలయమై సుఖముగా నుండెను. కాని రాజకుమారి గండాలపాలై, కష్టాల కలికియై ఆపదల కాలవాలమై బాధపడుచుండెను. తనకన్న అన్ని విధముల తక్కువగా నుండవలసినమంత్రి కుమార్తె సుఖముగా నుండుటయు, తాను గండాలతోనిండుటయు తలచి ఆమె పార్వతి పూజలు ప్రారంభించగా, ఆ దేవికి దయ కలిగి, ఆమెకు ప్రత్యక్షమై గండాల గౌరి నోము నోచుకొనమని ఆనతి ఇచ్చెను. రాజపుత్రిక ఆ నోమును నోచుకుని సకల సంపదలతో, నిత్య కల్యాణముతో, పచ్చతోరణముతో గండాలను గడచి సుఖించెను. అప్పటినుండి ప్రజలు ఆ కథను చెప్పుకొని అక్షతలు వేసుకొని, నోమును నోచుకొని గండములు లేక జీవించుచుండిరి. ఈ కథను చెప్పుకొని అక్షతలు ఏడాది పొడుగున వేసుకొనవలెను.
ఉద్యాపన
ఐదు శేర్ల నువ్వులపప్పుతో చిమ్మిలి చేసి విడి విడిగా మూడేసి వుండలు కట్టవలెను. తర్వాత పదమూడు జతల తక్కెడు చిప్పలు తెచ్చి, పదమూడు చిప్పలలోను ఒక్కొక్క చిమ్మిలి ముద్దనుంచి, మిగిలిన చిప్పలను వాటిమీద మూతవేయవలెను. పిమ్మట ఒకదానిని నైవేద్యముగ పెట్టి మిగిలిన పన్నెండు చిప్పలను పన్నెండుగురు పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలములతో వాయన మియ్యవలెను, నైవెద్యములు తాను తరువాత భుజించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి