23, ఏప్రిల్ 2016, శనివారం

స్త్రీలవ్రత కథలు : (మరొక) నిత్యదానము నోము కథ



(మరొక) నిత్యదానము నోము కథ

టీ||"నిత్య దానము చేయు నెలత కత్యంత
         సౌఖ్యంబు లమరును సత్యంబుగాను
         నిత్యకల్యాణమై నెగడు నొప్పుచును
         సత్యమార్గంబపుడు సాధ్యమగు నిలను"

అని యనుకొని అక్ష్తతలు వేసుకొని ప్రతిదినము చేరెడు బియ్యమును, ఒక కూరను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. అట్లొక సంవత్సరము చేసిన తరువాత ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన:
ఎద్దుతొక్కనిధాన్యము ఎనిమిది కుంచములొక గంపలోపోసి క్రొత్తబట్టచుట్టీ కాయగూరలు, దుంపకూరలు ,ఆకుకూరలు దానిలోపెట్టి శక్తికొలది దక్షిణతో నొక బ్రాహ్మణునకు దానము చేయవలెను. శక్తితగ్గిననూ ఫలము తగ్గదు.

స్త్రీలవ్రత కథలు : నిత్యదానము నోము కథ



నిత్యదానము నోము కథ
ఒక రాజు అజీర్ణవ్యాధితో బాధపడుచుండెను. ఎన్ని మందులు తినిననూ అతనికి ఆరోగ్యము చేకూరలేదు. అట్లుండగా ఒకానొక బ్రాహ్మణుడు పట్టణమునకు వచ్చి పెట్టినవారికి పుట్టినదేసాక్షియని గట్టిగా పాడుచుండెను. కోటబురుజు మీదున్న రాజు ఆ బ్రాహ్మణుని మాటలు విని అతనిని దివాణములోకి రప్పించి అట్లెందుకనెనో చెప్పమనెను. అంతట బ్రాహ్మణుడు రాజా! నామాటలకు నీవే నిదర్శనము. పూర్వజన్మలో నీవు ధనము కూడబెట్టి నీవుతినక, ఇతరులకు పెట్టక పిసినిగొట్టువై యుంటివి.ఆ పాప ఫలమే యిప్పుడు నీకు అజీర్ణవ్యాధిగా వచ్చినది. ఆ వ్యాధి పోవుటకు నీవు నిత్యదానము చేయుము అని చెప్పెను. అప్పటినుండి రాజు నిత్యదానము ఒక యేడాది పాటు చేసి పిమ్మట ఉద్యాపనము చెసుకొని సుఖముగా నొండెను.

ఉద్యాపన:
ప్రతిదినము ఒక బ్రాహ్మణునకోదోసెడు ధాన్యము, ఒక కూరయు దానము చేయవలెను, ఆ విధముగా నొక ఎఏడాదిపాటు చేసిన పిమ్మట ఎద్దుతొక్కని ధాన్యము ఎనిమిది కుంచములుతెచ్చి గంపలో పోసి దానికి క్రొత్తబట్ట చుట్టి, దానిలొ ఆమె కూరలు దుంపకూరలు ,కాయగూరలు, దక్షిణ తాంబూలములతో ఆ బ్రాహ్మణునకు దానమియ్యవలెను.

స్త్రీలవ్రత కథలు : శాకదానమునోముకథ



శాకదానమునోముకథ
ఒక ఊరి రాజుభార్య, మంత్రి భార్య శాకదానమునోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినము నొకతొటకూర కాడ ఒక డబ్బు చొప్పున ఏడాది దానము చేస్తూ సంతోషముగ నుండెను. రాజుభార్య సంవత్సరమునకు ఒకసారే శాకదానము చేసెను. కాని అది ఉల్లంఘన యగుటచే నామెక కారణ శోకము వచ్చెను. ఆమె యా విషయమును పార్వతీదేవికి విన్నపించుకొనగా నామె ’ నీవు శాకదానము నోము పట్టి ఉల్లంఘన చేయుటచే కష్టమువచ్చెను. కావున ఆనోము యధావిధిగా నోచుకొమ్ము’ అని ఆజ్ఞ ఇచ్చెను. పిమ్మట ఆమె యానోము సక్రమముగ నోచుకొని శోకములేకుండ సుఖముగ ఉండెను.

ఉద్యాపన:
ఒక బ్రాహ్మణునకు తలంటి నీళ్ళుపోసి జామారు కట్టబెట్టి మడిలోని తోటకూర మొక్కలను తెచ్చి పదమూడు డబ్బులు దక్షిణతో వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రత కథలు : చిత్రగుప్తునినోము కథ



చిత్రగుప్తునినోము కథ
ఒక రాజ భార్య, మంత్రిభార్య అన్ని నోములు సమానంగా జేయుచుండిరి. కాని రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచుట మరచిపోయెను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంత కాలమునకు వారిద్దరూ చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును రాజుభార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజుభార్య ’ స్వామీ! మంత్రిభార్యవలె నేనును వ్రతములను చెసితిని నాకు నరకము వచ్చుటకు కారణమేమి?" అని అడిగెను. అప్పుడు అతడామెకు ’చిత్రగుప్తుని నోమునోచలేదు’ గనుక జరిగెనని, చెప్పను. ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని పిదప స్వర్గలోకమునకు వెళ్ళెను.

ఉద్యాపన:
ఈ కథ చెప్పుకొని యేడాది అక్షతలు వేసుకొని ఉద్యాపన చేయవలెను. కట్లు లేని గంపలో యెడ్లుతొక్కని వడ్లు ఐదు కుంచములో పోసి, వాటిలో నొక గుమ్మడి పండు అడ్డెడు తవ్వెడు బియ్యము, ఐదు మూరలు పట్టుపంచె పెట్టి దక్షిణ తాంబూలములతో, వెండి ఆకుతో, బంగారు గంటముతో అన్నగారికి గాని, గ్రామకరణమునకుగాని ఇవ్వవలెను.

స్త్రీలవ్రత కథలు : మారేడు దళ వ్రత కథ



మారేడు దళ వ్రత కథ
ఒక రాజ కుమారుడు చనిపోయెను. అతని తండ్రి రాజ పీనుగు తోడు లేకుండ పోరాదు, కావున నాకొడుకు శవమునకు తోడుగా ఎవరినైనా తీసుకురండని భటులను పంపెను. చచ్చినవానికి తోడు పంపుటక్కెవ్వరూ అంగీకరింపలేదు. కాని ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాశాపరురాలై తన సవతి పిల్లను ఎత్తుకెత్తు ధనము పుచ్చుకొని అమ్మెను. వారాపిల్లను తీసుకొనివెళ్ళి రాజకుమారునిశవముతో కట్టి శ్మశానమునకు తీసుకొనిపోవుచుండగా చీకటిపడి పెద్ద వర్షము వచ్చెను. అందుచే వారాకటుకును శివాలయముదగ్గర వదిలిపెట్టి ఇండ్లకు పోయిరి. అప్పుడా చిన్నది కట్లువిప్పుకొని, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయుచు ఏడ్చుచుండెను. అప్పుడు పార్వతీదేవి ఆమె దుఃఖమునకు కారణము తెలుసుకొని, ఆమెకు అక్షతులు, మంత్రజలమును ఇచ్చి చచ్చినవానిపై చల్లమని, మారేడు దళము నోమునోచుకొనమని చెప్పెను. బ్రాహ్మణ బాలిక అట్లుచేయగ రాజకుమారుడు బ్రతికి గత చరిత్ర నంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను. అంతలో తెల్లవారుటచే వారిని దహనము చెయుటకు రాజబంధువులువచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడారాజు ఆ చిన్న దానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవముగా వివాహము చేసెను. పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడుదళవ్రత మాచరించి నిత్య సంతోషముతో జీవించెను.

ఉద్యాపన:
వెండి దళము, బంగారుదళము, మారేడుదళము కలిపి మూడుదోసిళ్ళ బియ్యముతో శివునకు పూజచేసి బీదలకు సంతర్పణ చేయవలెను.

స్త్రీలవ్రతకథలు : గ్రామ కుంకుమ నోము కథ



గ్రామ కుంకుమ నోము కథ
ఒక బ్రాహ్మణునకు ప్రాణగండముండెను. అతని భార్య గ్రామకుంకుమ నోము నోచి యధావిధిగా పండ్లు పసుపు, కుంకుమ పట్టుకొని వీధివీధుల పంచిపెట్టసాగెను. ఆమె మొదట వీధిలో పంచిపెట్టునంతలో పెద్దకొడుకు వచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా ఆమె ఇంకో వీధి యున్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలోపంచిపెట్టుచొండగా రెండవ కొడుకు వచ్చి రోగము ముదిరిపోయిందని చెప్పెను, ఆమె ఇంకొక వీధి యున్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవకొడుకు వచ్చి తండ్రికి ప్రాణంమీదకి వచ్చెననిచెప్పెను అప్పుడామె ఇంకొకవీధి మాత్రమున్నదని చెప్పి నాల్గవవీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవకొడుకొచ్చి తండ్రిని క్రింద పెట్టినట్లు చెప్పెను ఆమె ఇంకొక వీధిమాత్రమున్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా అయిదవ కొడుకు వచ్చి చనిపోయినట్లు చెప్పెను గాని ఆమె వీధి అంతకు పంచిపెట్టువరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బ్రతికి లేచి కూర్చుండెను. యది చూచి అందరూ యది గ్రామ కుంకుమ నోము శుభమనియెంచి నాటినుండి ఆ నోము నోచుకొనుచుండిరి.
ఉద్యాపన:
పసుపు కుంకుమలు వీసె యేబులము చొప్పున పండ్లతో కలిపి గ్రామములో పంచిపెట్టవలెను.

స్త్రీలవ్రతకథలు : ధైర్యలక్ష్మి నోము కథ



ధైర్యలక్ష్మి నోము కథ
ఒక బ్రాహ్మణస్త్రీకి ఐదుగురు తమ్ముళ్ళుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణంమీదకు వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళేది కాదు. ఆ విధముగా నలుగురకు పెళ్ళిండ్లు అయినవి. అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడ యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణము మీదకి వచ్చెను. ఈ సారి ఆమె తన ధైర్యలక్ష్మియే తనను కాపాడగలదని యెంచుకొని రోగి అగు మగనిని ఇంటిలోపెట్టి తమ్ముని పెండ్లికి ప్రయాణమై పోవుచుండగా దారిలోనొక జువ్వి చెట్టు కనబడెను . ఆమె ఆ చెట్టుకు ముమ్మారు ప్రదక్షిణలు చేసి తల్లీ! నీవే నాపాలిట ధైర్య లక్ష్మివి. నేను పుట్టింటినుండి తిరిగి వచ్చేసరికి నా భర్త ఆరోగ్యముగనున్నచో నీకు ఏడాది పొడుగున పూజచేసెదను, అని నమస్కరించి వెళ్ళిపోయెను. పెండ్లైన వెంటనే ఆమె తిరిగి యింటికివచ్చుసరికి భర్త ఆరోగ్యముగ నుండెను. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.