గుమ్మడిగౌరినోము కథ
ఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లయిన ఐదవనాడు మృత్యువు వున్నది. ఆ సంగతి తెలియక తల్లితండ్రులతనికి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన ఐదవ దినమున యమదూతలు అతని ప్రాణములను తీసుకుపోవుటకు వచ్చిరి. వారిని ఆతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను తీసుకొని అడవి మార్గమున పరుగెత్తుచుండెను. యమభటులను తప్పించుకొనవలెనని ఆ అమాయకురాలు చేయుచున్న ప్రయత్నమునకు నవ్వుకొని పార్వతీదేవి ఒక వృద్ధ స్త్రీవలె వచ్చి "అమ్మాయీ! మగనివెంట వేసుకొని ఎక్కడికి యెగబడిపోవుచున్నావు?" అని అడిగెను. అందుకా చిన్నది "దొడ్డమ్మా! నాభర్త ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చినారు. నేనీ అడవిలోనున్న పార్వతీదేవి ఆలయమున కేగి ఆమెను ప్రార్ధించి పతిభిక్షను తెచ్చుకొనవలయునని పోవుచున్నాను" ననెను. అప్పుడామె ఆ చిన్నదానితో గుమ్మడి గౌరి నోము నోపించి, ఉద్యాపనము చేయించి, వాయనము పుచ్చుకొని ఐదవ తనమును ప్రసాదించెను. పిమ్మట ఆమె భర్త మృత్యువుబారినుండి రక్షింపబడెను.
గుమ్మడిగౌరినోము నోచిన కాంత కాంతునకు పూర్ణాయుర్దాయము కలుగును.
ఉద్యాపన:
ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని మూడు గుమ్మడిపండ్లను రవికెలగుడ్డ, పసుపు, కుంకుమలతో ఉంచి ఒక ముసలి ముత్తైదువునకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి