మారేడు దళ వ్రత కథ
ఒక రాజ కుమారుడు చనిపోయెను. అతని తండ్రి రాజ పీనుగు తోడు లేకుండ పోరాదు, కావున నాకొడుకు శవమునకు తోడుగా ఎవరినైనా తీసుకురండని భటులను పంపెను. చచ్చినవానికి తోడు పంపుటక్కెవ్వరూ అంగీకరింపలేదు. కాని ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాశాపరురాలై తన సవతి పిల్లను ఎత్తుకెత్తు ధనము పుచ్చుకొని అమ్మెను. వారాపిల్లను తీసుకొనివెళ్ళి రాజకుమారునిశవముతో కట్టి శ్మశానమునకు తీసుకొనిపోవుచుండగా చీకటిపడి పెద్ద వర్షము వచ్చెను. అందుచే వారాకటుకును శివాలయముదగ్గర వదిలిపెట్టి ఇండ్లకు పోయిరి. అప్పుడా చిన్నది కట్లువిప్పుకొని, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయుచు ఏడ్చుచుండెను. అప్పుడు పార్వతీదేవి ఆమె దుఃఖమునకు కారణము తెలుసుకొని, ఆమెకు అక్షతులు, మంత్రజలమును ఇచ్చి చచ్చినవానిపై చల్లమని, మారేడు దళము నోమునోచుకొనమని చెప్పెను. బ్రాహ్మణ బాలిక అట్లుచేయగ రాజకుమారుడు బ్రతికి గత చరిత్ర నంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను. అంతలో తెల్లవారుటచే వారిని దహనము చెయుటకు రాజబంధువులువచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడారాజు ఆ చిన్న దానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవముగా వివాహము చేసెను. పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడుదళవ్రత మాచరించి నిత్య సంతోషముతో జీవించెను.
ఉద్యాపన:
వెండి దళము, బంగారుదళము, మారేడుదళము కలిపి మూడుదోసిళ్ళ బియ్యముతో శివునకు పూజచేసి బీదలకు సంతర్పణ చేయవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి