14, ఏప్రిల్ 2016, గురువారం

స్త్రీలవ్రతకథలు : పొట్ట కదలని గౌరి నోము కథ



పొట్ట కదలని గౌరి నోము కథ

(దీనిని కడుపు కదలని గౌరి నోము అని కూడా అంటారు)

ఒక సోయయాజులవారికి ఒకత్తే కూతురు. ఆయన సంబంధాలు వెదకి నిరుపేదబ్రాహ్మణబాలునకిచ్చి ఆమెను పంపెను. ఆమె భర్త పేదవాడైనను పేదపండితుడు. ఆమె అతిభక్తితో నతనిని సేవించుచు, అత్తమామలయందు భక్తిచూపుచు కాలము గడుపుచుండెను. కొంతకాలమున కామెకు నెల దప్పెను. అందరూ సంతోషించిరి. కాని ఆమెకా గర్భము నిలువలేదు. అట్లే ఎన్నో పర్యాయములు ఆమెకు గర్భవిచ్ఛితిబ్రాప్తించెను. అందుచే నామెదుఃఖించుచు పార్వతీదేవిని తలచుకొని పుణ్యకార్యములను చేయుచు కాలము గడుపుచుండెను. అట్లుండగా నొకనాటియుదయమున పార్వతీదేవి ఒక వృద్ధబ్రాహ్మణి వలె నామె యింటికి వచ్చెను. సోమయాజులగారి కుమార్తె ఆమెను చూచి మిగుల గౌరవించి ఆనాటికి తమ యింటియందే భోజనము చేయవలసినదని వినయవిధేయలతో ప్రార్థించెను. ఆమె అందుకొండబడెను. భోజనమైన తర్వాత ఆ వృద్ధనారి సోమయాజులగారి కుమార్తెకు గర్భదోషమున్నదని తెలుపగా నామె దానికేమి చేయవలెనో సెలవీయవలసినదని అడుగగా నోము, ఉద్యాపనము తెలిపి వెళ్ళి పోయెను. తరువాత సోమయాజులగారి కుమార్తె ఆ నోము నోచి దబ్బపళ్ళవంటి కొడుకులను కని సంతోషముగా నుండెను.

ఉద్యాపన:
అయిదు శేర్లు బియ్యపు పిండితో ఇరువదిఐదు జిల్లేడుకాయలుచేసి, వాటిలోకొబ్బరి పూర్ణమును గాని లేక నువ్వుపప్పు పూర్ణమును గాని పెట్టి, పొట్టలు చెదరకుండా జాగ్రత్తగా వండవలెను. పిమ్మట వాటిని అయిదేసి హొప్పున ఐదుగురు ముత్తైదువులకు దక్షిణ తాంబూలములతో వాయన మియ్యవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి