23, ఏప్రిల్ 2016, శనివారం

స్త్రీలవ్రత కథలు : (మరొక) నిత్యదానము నోము కథ



(మరొక) నిత్యదానము నోము కథ

టీ||"నిత్య దానము చేయు నెలత కత్యంత
         సౌఖ్యంబు లమరును సత్యంబుగాను
         నిత్యకల్యాణమై నెగడు నొప్పుచును
         సత్యమార్గంబపుడు సాధ్యమగు నిలను"

అని యనుకొని అక్ష్తతలు వేసుకొని ప్రతిదినము చేరెడు బియ్యమును, ఒక కూరను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. అట్లొక సంవత్సరము చేసిన తరువాత ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన:
ఎద్దుతొక్కనిధాన్యము ఎనిమిది కుంచములొక గంపలోపోసి క్రొత్తబట్టచుట్టీ కాయగూరలు, దుంపకూరలు ,ఆకుకూరలు దానిలోపెట్టి శక్తికొలది దక్షిణతో నొక బ్రాహ్మణునకు దానము చేయవలెను. శక్తితగ్గిననూ ఫలము తగ్గదు.

స్త్రీలవ్రత కథలు : నిత్యదానము నోము కథ



నిత్యదానము నోము కథ
ఒక రాజు అజీర్ణవ్యాధితో బాధపడుచుండెను. ఎన్ని మందులు తినిననూ అతనికి ఆరోగ్యము చేకూరలేదు. అట్లుండగా ఒకానొక బ్రాహ్మణుడు పట్టణమునకు వచ్చి పెట్టినవారికి పుట్టినదేసాక్షియని గట్టిగా పాడుచుండెను. కోటబురుజు మీదున్న రాజు ఆ బ్రాహ్మణుని మాటలు విని అతనిని దివాణములోకి రప్పించి అట్లెందుకనెనో చెప్పమనెను. అంతట బ్రాహ్మణుడు రాజా! నామాటలకు నీవే నిదర్శనము. పూర్వజన్మలో నీవు ధనము కూడబెట్టి నీవుతినక, ఇతరులకు పెట్టక పిసినిగొట్టువై యుంటివి.ఆ పాప ఫలమే యిప్పుడు నీకు అజీర్ణవ్యాధిగా వచ్చినది. ఆ వ్యాధి పోవుటకు నీవు నిత్యదానము చేయుము అని చెప్పెను. అప్పటినుండి రాజు నిత్యదానము ఒక యేడాది పాటు చేసి పిమ్మట ఉద్యాపనము చెసుకొని సుఖముగా నొండెను.

ఉద్యాపన:
ప్రతిదినము ఒక బ్రాహ్మణునకోదోసెడు ధాన్యము, ఒక కూరయు దానము చేయవలెను, ఆ విధముగా నొక ఎఏడాదిపాటు చేసిన పిమ్మట ఎద్దుతొక్కని ధాన్యము ఎనిమిది కుంచములుతెచ్చి గంపలో పోసి దానికి క్రొత్తబట్ట చుట్టి, దానిలొ ఆమె కూరలు దుంపకూరలు ,కాయగూరలు, దక్షిణ తాంబూలములతో ఆ బ్రాహ్మణునకు దానమియ్యవలెను.

స్త్రీలవ్రత కథలు : శాకదానమునోముకథ



శాకదానమునోముకథ
ఒక ఊరి రాజుభార్య, మంత్రి భార్య శాకదానమునోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినము నొకతొటకూర కాడ ఒక డబ్బు చొప్పున ఏడాది దానము చేస్తూ సంతోషముగ నుండెను. రాజుభార్య సంవత్సరమునకు ఒకసారే శాకదానము చేసెను. కాని అది ఉల్లంఘన యగుటచే నామెక కారణ శోకము వచ్చెను. ఆమె యా విషయమును పార్వతీదేవికి విన్నపించుకొనగా నామె ’ నీవు శాకదానము నోము పట్టి ఉల్లంఘన చేయుటచే కష్టమువచ్చెను. కావున ఆనోము యధావిధిగా నోచుకొమ్ము’ అని ఆజ్ఞ ఇచ్చెను. పిమ్మట ఆమె యానోము సక్రమముగ నోచుకొని శోకములేకుండ సుఖముగ ఉండెను.

ఉద్యాపన:
ఒక బ్రాహ్మణునకు తలంటి నీళ్ళుపోసి జామారు కట్టబెట్టి మడిలోని తోటకూర మొక్కలను తెచ్చి పదమూడు డబ్బులు దక్షిణతో వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రత కథలు : చిత్రగుప్తునినోము కథ



చిత్రగుప్తునినోము కథ
ఒక రాజ భార్య, మంత్రిభార్య అన్ని నోములు సమానంగా జేయుచుండిరి. కాని రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచుట మరచిపోయెను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంత కాలమునకు వారిద్దరూ చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును రాజుభార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజుభార్య ’ స్వామీ! మంత్రిభార్యవలె నేనును వ్రతములను చెసితిని నాకు నరకము వచ్చుటకు కారణమేమి?" అని అడిగెను. అప్పుడు అతడామెకు ’చిత్రగుప్తుని నోమునోచలేదు’ గనుక జరిగెనని, చెప్పను. ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని పిదప స్వర్గలోకమునకు వెళ్ళెను.

ఉద్యాపన:
ఈ కథ చెప్పుకొని యేడాది అక్షతలు వేసుకొని ఉద్యాపన చేయవలెను. కట్లు లేని గంపలో యెడ్లుతొక్కని వడ్లు ఐదు కుంచములో పోసి, వాటిలో నొక గుమ్మడి పండు అడ్డెడు తవ్వెడు బియ్యము, ఐదు మూరలు పట్టుపంచె పెట్టి దక్షిణ తాంబూలములతో, వెండి ఆకుతో, బంగారు గంటముతో అన్నగారికి గాని, గ్రామకరణమునకుగాని ఇవ్వవలెను.

స్త్రీలవ్రత కథలు : మారేడు దళ వ్రత కథ



మారేడు దళ వ్రత కథ
ఒక రాజ కుమారుడు చనిపోయెను. అతని తండ్రి రాజ పీనుగు తోడు లేకుండ పోరాదు, కావున నాకొడుకు శవమునకు తోడుగా ఎవరినైనా తీసుకురండని భటులను పంపెను. చచ్చినవానికి తోడు పంపుటక్కెవ్వరూ అంగీకరింపలేదు. కాని ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాశాపరురాలై తన సవతి పిల్లను ఎత్తుకెత్తు ధనము పుచ్చుకొని అమ్మెను. వారాపిల్లను తీసుకొనివెళ్ళి రాజకుమారునిశవముతో కట్టి శ్మశానమునకు తీసుకొనిపోవుచుండగా చీకటిపడి పెద్ద వర్షము వచ్చెను. అందుచే వారాకటుకును శివాలయముదగ్గర వదిలిపెట్టి ఇండ్లకు పోయిరి. అప్పుడా చిన్నది కట్లువిప్పుకొని, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయుచు ఏడ్చుచుండెను. అప్పుడు పార్వతీదేవి ఆమె దుఃఖమునకు కారణము తెలుసుకొని, ఆమెకు అక్షతులు, మంత్రజలమును ఇచ్చి చచ్చినవానిపై చల్లమని, మారేడు దళము నోమునోచుకొనమని చెప్పెను. బ్రాహ్మణ బాలిక అట్లుచేయగ రాజకుమారుడు బ్రతికి గత చరిత్ర నంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను. అంతలో తెల్లవారుటచే వారిని దహనము చెయుటకు రాజబంధువులువచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడారాజు ఆ చిన్న దానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవముగా వివాహము చేసెను. పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడుదళవ్రత మాచరించి నిత్య సంతోషముతో జీవించెను.

ఉద్యాపన:
వెండి దళము, బంగారుదళము, మారేడుదళము కలిపి మూడుదోసిళ్ళ బియ్యముతో శివునకు పూజచేసి బీదలకు సంతర్పణ చేయవలెను.

స్త్రీలవ్రతకథలు : గ్రామ కుంకుమ నోము కథ



గ్రామ కుంకుమ నోము కథ
ఒక బ్రాహ్మణునకు ప్రాణగండముండెను. అతని భార్య గ్రామకుంకుమ నోము నోచి యధావిధిగా పండ్లు పసుపు, కుంకుమ పట్టుకొని వీధివీధుల పంచిపెట్టసాగెను. ఆమె మొదట వీధిలో పంచిపెట్టునంతలో పెద్దకొడుకు వచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా ఆమె ఇంకో వీధి యున్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలోపంచిపెట్టుచొండగా రెండవ కొడుకు వచ్చి రోగము ముదిరిపోయిందని చెప్పెను, ఆమె ఇంకొక వీధి యున్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవకొడుకు వచ్చి తండ్రికి ప్రాణంమీదకి వచ్చెననిచెప్పెను అప్పుడామె ఇంకొకవీధి మాత్రమున్నదని చెప్పి నాల్గవవీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవకొడుకొచ్చి తండ్రిని క్రింద పెట్టినట్లు చెప్పెను ఆమె ఇంకొక వీధిమాత్రమున్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా అయిదవ కొడుకు వచ్చి చనిపోయినట్లు చెప్పెను గాని ఆమె వీధి అంతకు పంచిపెట్టువరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బ్రతికి లేచి కూర్చుండెను. యది చూచి అందరూ యది గ్రామ కుంకుమ నోము శుభమనియెంచి నాటినుండి ఆ నోము నోచుకొనుచుండిరి.
ఉద్యాపన:
పసుపు కుంకుమలు వీసె యేబులము చొప్పున పండ్లతో కలిపి గ్రామములో పంచిపెట్టవలెను.

స్త్రీలవ్రతకథలు : ధైర్యలక్ష్మి నోము కథ



ధైర్యలక్ష్మి నోము కథ
ఒక బ్రాహ్మణస్త్రీకి ఐదుగురు తమ్ముళ్ళుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణంమీదకు వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళేది కాదు. ఆ విధముగా నలుగురకు పెళ్ళిండ్లు అయినవి. అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడ యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణము మీదకి వచ్చెను. ఈ సారి ఆమె తన ధైర్యలక్ష్మియే తనను కాపాడగలదని యెంచుకొని రోగి అగు మగనిని ఇంటిలోపెట్టి తమ్ముని పెండ్లికి ప్రయాణమై పోవుచుండగా దారిలోనొక జువ్వి చెట్టు కనబడెను . ఆమె ఆ చెట్టుకు ముమ్మారు ప్రదక్షిణలు చేసి తల్లీ! నీవే నాపాలిట ధైర్య లక్ష్మివి. నేను పుట్టింటినుండి తిరిగి వచ్చేసరికి నా భర్త ఆరోగ్యముగనున్నచో నీకు ఏడాది పొడుగున పూజచేసెదను, అని నమస్కరించి వెళ్ళిపోయెను. పెండ్లైన వెంటనే ఆమె తిరిగి యింటికివచ్చుసరికి భర్త ఆరోగ్యముగ నుండెను. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

స్త్రీలవ్రతకథలు : నిత్యశృంగారపు నోము కథ


 

నిత్యశృంగారపు నోము కథ
రాజుభార్య, మంత్రి భార్య నిత్యశృంగారపు నోము పట్టిరి. మంత్రి భార్య శ్రద్ధగా పేరంటాడ్రకు బొట్టుపెట్టి తాంబూలములనిచ్చి వ్రతము సాంతముచేసి ధనవంతురాలయియుండెను. రాజు భార్య ముత్తైదువులకు దాసీలచే బొట్టు పెట్టించుటచే  దరిద్రవంతురాలయ్యెను.  ఆమె తన దుర్దశకు దుఃఖించి పార్వతీదేవిని ప్రార్ధింపగా ఆమె ప్రత్యక్షమై నీవు అజాగ్రత్తగా దాసీలచే పేరంటాండ్రకు బొట్టుపెట్టించి  దరిద్రాలువైతివి. యిప్పుడా నోమును జాగ్రత్తగా నోచుకొనుము అని చెప్పి అంతర్ధానమయ్యెను. అప్పటినుండి ఆ రాజుభార్య నోముపట్టి ప్రతిదినము ఒక పుణ్యస్త్రీకి బొట్టుపెట్టి అద్దము చూపించి తాంబూలమిచ్చి ఏడాదిగడవగనే ఉద్యాపనము చేసుకొనెను. అంతటామె భర్తకు పోయినరాజ్యము తిరిగి ప్రాప్తించెను.

ఉద్యాపన:
ఒక పుణ్యస్త్రీకి తలంటినీళ్ళుపోసి, చీర రవికెలగుడ్డనిచ్చి భోజనముబెట్టినతరువాత అద్దము, దువ్వెన, కాటుక కాయ, కుంకుమభరిణ, గంధపుచెక్క వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు : విష్ణు కమలాల నోము కథ


విష్ణు కమలాల నోము కథ రాజు కూతురు తన ముఖముకన్న మంత్రికుమార్తె ముఖము కమలమువలె కలకలలాడుటకు కారణమేమని పురోహితునడుగగా అతడామెను విష్ణు కమలాలనోము పట్టమని చెప్పి దాని మహాత్మ్యమును దెలుపు నొక కథను చెప్పెదెను వినుము అని యీ విధముగా చెప్పెను. స్వర్గలోకమున విష్ణుమూర్తి లక్ష్మి ముఖము వంటి ముఖము కలుగుటకు స్త్రీలకొక వ్రతమును నియమించెను. దానిని విష్ణు కమలాలనోము అని యందరు ప్రతిదినము ఒక కమల వత్తిని ఆవు నేతితో వెలిగించవలెను. అట్లు ఏడాది చేసిన తరువాత వెండి ప్రమిదను ,బంగారు ప్రమిదను చేయించి వాటిలో ఆవు నెయ్యివేసి కమలపు వత్తులతో జ్యోతులను వెలిగించవలెను. తరువాత మానెడు సోలడు బియ్యమును దక్షిణ తాంబూలములతో బ్రాహ్మణుని కొసగవలెను.

స్త్రీలవ్రతకథలు : మూల గౌరి నోము కథ



మూల గౌరి నోము కథ
ఒక రాచబిడ్డ మూలగౌరి నోము నోచుకుని సకలైశ్వర్యములతో, సామ్రాజ్యమేలు భర్తతో, సద్గుణవంతులగు పుత్రులతో, ముద్దుగొలిపే ముని మనుమలతో అలరారు చుండెను. ఆమె వ్రత మహాత్మ్యమును పరీక్షింపగోరి పార్వతీ పరమేశ్వరు లామె భర్తకు విరోధియగు నొక రాజుహృదయములో ప్రవేశించి, అతనితో యుద్ధమును చేయించిరి. ఆమె భర్తకన్న నతడు అల్పవంతుడై యుండియు దైవబలసమేతుడైయుండ విజయమునంది ఆమె భర్తను బంధుకోటిని చంపెను. యుద్ధములో మరణించిన ఆమె బంధువులను వీరస్వర్గమునకు వెళ్ళుటకు యమభటులు వచ్చిరి. అది గాంచిన యా రాణి మహా ధైర్యముతో యుద్ధభూమియందు నిలిచి యమదూతలతో -


శ్లో|| దొడ్డవారగు యమదూతలారా! తొలగిపొండి
పతిసౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయన మిచ్చేను
భాగ్యాలు నిలుపుకొనుటకు బంగారము వాయన మిచ్చేను
ఇల్లు వాకిళ్ళు నిలుపుకొనుటకు తెల్ల చీర వాయన మిచ్చేను
తోటల కొఱకు బాటల కొఱకు తోపు చీర వాయన మిచ్చేను
బిడ్డల సంతతి కోరుచు బీరకాయలు వాయన మిచ్చేను
కడుపు చలువ కొఱకు కండ చక్కెర వాయన మిచ్చేను
చిన్న మనుమలు సుఖాల కొఱకు చెఱుకు గడలు వాయన మిచ్చేను
పసిపాపల ఓలలాడవలెనని పసినిమ్మపళ్ళు వాయన మిచ్చేను
అల్లుళృ సంతోష మందవలెనని అరిసెలు వాయన మిచ్చేను
కూతుళ్ళు సిరిసంపదలు కోరి కుడుములు వాయన మిచ్చేను
బంధువుల బాగును గోరి బంతి పూలు వాయన మిచ్చేను
పొరుగువారి బాగునెంచి పొగడపూలు వాయన మిచ్చేను
ప్రజలంతా పెంపొందుటకై వజ్రాలు వాయన మిచ్చేను
రాజ్యమంతా సుభిక్షమగుటకై రత్నాలు వాయన మిచ్చేను
పాడిపంటల అభివృద్ధికై పాయసము వాయన మిచ్చేను
శాంతి దేశంలో నిలుచుటకై చల్ల పునుకులు వాయన మిచ్చేను
అందరిలో నాధిక్యతకై అద్దాలు వాయన మిచ్చేను
పేరు ప్రతిష్టతలు పెంపు నందగా గారెలు వాయన మిచ్చేను
పుణ్యలోకము పొందుటకై బూరెలు వాయన మిచ్చేను
స్వర్గ లోకమందుటకై స్వర్ణ రాశిని వాయన మిచ్చేను
ప్రాణ భయములు లేకుండటకై పాయసము వాయన మిచ్చేను
కోరికలన్నీ తీర్చుటకై కొబ్బరికాయలు వాయన మిచ్చేను
అకాల మరణములు లేకుండుటకై అరటి పండ్లు వాయన మిచ్చేను
పట్ట లేరు మీరెవ్వరును నాభర్త ప్రాణాలు
దొడ్డవారగు యమదూతలారా! తొలగిపొండి



అని యనుసరికి వారామె పాతివ్రత్యమహిమముందు నిలువలేక యుద్ధములో మరణించిన వారి ప్రాణములను వదలిపోయిరి. అంతట పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రభావమునకు సంతోషించి, ఆమె బంధువులందరినీ యుద్ధములో చచ్చినవారిని బ్రతికించి, ప్రత్యక్షమై కావలసిన వరములు ఆమె కొసగి వెళ్ళిపోయిరి.

ఉద్యాపన:
కథలో చెప్పిన యిరువది ఐదు వస్తువులను పుణ్యస్త్రీలకు వీలైనపుడు వాయన మియ్యవలెను. ఐదుగురు ముత్తైదువులను పిలిచి పసుపు రాసి, బొట్టు పెట్టి దక్షిణ తాంబూలాలతో ఒక్కొక్క ముత్తైదువునకు అయిదేసి వస్తువులను వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు : గ్రహణగౌరినోము కథ



గ్రహణగౌరినోము కథ
ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు ఒక కూతురు ఉండెను. ఆ పిల్ల దురదృష్టవశముచే పుట్టినది మొదలు పగలు పిల్లగను, రాత్రి పురుగులగను అగుచుండెడిది. తల్లి రాత్రులంతా పురుగులనన్నింటినీ పోగుచేసి కాపాడుచుండగా, తెల్లవారుసరికి ఆ పురుగునన్నీ చేరి పిల్లగనగుచుండెను. అట్లుండగా ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళవలెనని వచ్చెను. కాని ఆమె బిడ్డ పరిస్థితి బయల్పడకుండా కాపాడ దలచి, పుట్టింటికి వెళ్ళలేదు. అట్లనేక పర్యాయములు ఆమె పుట్టింటికి వెళ్ళకుండ ఉండెను. కాని పండుగ ముందామె పెద్దన్నగారు వచ్చి పట్టుదలతో తీసుకొని వెళ్ళదలచెను. అందుచే ఆమె చేయునది లేక 4గురు కోడండ్రను బిలిచి కుఱ్ఱవాళ్ళను, తాను వచ్చువరకు చూడవలసినదని కోరెను. పెద్ద కోడండ్రు ముగ్గురూ అందుకు అంగీకరించలేదు.చిన్న కోడలు ఒప్పుకొనెను. అప్పుడామె చిన్నకోడలితో తన కూతురు రహస్యమును చేప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంటదగ్గర ప్రక్కవేసి ఒక్క పురుగైన చెదరకుండా వానిని లోనికి ప్రోగుచేసి కాపాడవలెనని బహు రహస్యముగా చెప్పి పుట్టింటికి వెళ్ళెను. ఆ చిన్న కోడలుతన వాగ్దానము ప్రకారము ఆ బిడ్డను కంటికి రెప్పవలె కాపాడుచు, రాత్రులందు భర్త దగ్గరకైన వెళ్ళకుండా ఉండెను. అట్లు నాలుగు దినములు గడిచెను. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించి, ఐదవనాడు అటుక మీద కూర్చుండి భార్యను కనిపెట్టుచుండెను. చీకటిపడిన వెంటనే అతడు పిల్ల పురుగులుగా మారుటకు వాటినన్నింటినీ తన భార్య గుంటలోకి ప్రోగుచేయుచు, రాత్రంతయు నిద్రలేకుండా యుండుటయు చూచి అతడా రహస్యమేమని భార్యనడిగెను గాని రహస్యమేమో ఆమెకు తెలియలేదు. అందుచేత అత్తగారి ఆజ్ఞను మాత్రమతనికి తెలిపెను. అది విని ఆ రహస్యమును గ్రహించవలెనని గట్టి పట్టుదలతో నాతడు అరణ్యమునకు బోయి తపస్సుచేయ మొదలిడెను. అంతలో నాత్రోవను బోవుచున్న పార్వతీ పరమేశ్వరులు తన తపస్సునకు కారణమేమని యడుగగా నతడు తన నిశ్చయమును తెలిపెను. అప్పుడు పార్వతి "ఓ చిన్నవాడా! నీ చెల్లెలు పూర్వజన్మమందు రజస్వలై ఆ దోషమును ఇంట కలిపెను. ఆ పాపఫలముగా నామె యీ జన్మమున రాత్రివేళ పురుగులగుచున్న "దని చెప్పెను. అది విని యతడు తల్లీ! ఆమె కాపీడయెట్లుతొలగునో సెలవిమ్మని పాదములు మీద వ్రాలెను. ఆమె దయతలచి "నాయనా ! నీ చెల్లెలితో గ్రహణ గౌరీ నోము నోపించుము. అప్పుడామె కాపీడ తొలగ గలదు" యని చెప్పి అదృశ్యమైనది. ఆ చిన్నవాడు సంతోషముతో గృహమునకు వచ్చి చెల్లిలితో ఆనోము నోపించగా నామెయు దోషరహితయై రాత్రింబవళ్ళు బాలికరూపము నందెను, అంతలో ఆతని తల్లిపుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్నకోడలి దగ్గరనుండి కూతురిని తీసుకుని పోయెను. ఆ రాత్రి బిడ్డ పురుగులగా మారకుండుటకాశ్చర్యపడి, కోడలికి ఆ విషయమును తెలుపగా, నామెకంతకు పూర్వము జరిగిన విషయమును తెలిపెను. అంత కోడలి విశ్వాసమునకు , కొడుకు పట్టుదలకు పార్వతీ దేవి దయకు సంతోషించి అందరితో సుఖముగా నుండెను.

ఉద్యాపన:
సూర్యగ్రహణము పట్టిన క్షణము పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రత్తి, బెల్లం, ఆకు పోక పందిరిలో పెట్ట వలెను. గ్రహణము విడిచినంతనే వాటిని యింటిలో పెట్టవలెను. ఆ తరువాత రోజునుండి తొమ్మిది రోజులవరకు గౌరిని పూజించవలెను. తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు చేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి, తొమ్మిది అట్లు నైవేద్యము పెట్టవలెను. ఆఖరి రోజున ఆకులు, పోకలు, అట్లు క్రొత్తజల్లెడలోపల పెట్టి పాతజల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

19, ఏప్రిల్ 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు : నందికేశ్వర వ్రత కథ



నందికేశ్వర వ్రత కథ
ఒక నాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా ఆతడామె చేతులుకఠినంబుగ నున్నందున తనపాదములనుపట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగానున్నవో తెలపవలసినదని అడుగగా హరుడామె ’పరోపకారము’ చేయలేకపోవుటచే నట్టి కాఠిన్యపుహస్తములు వచ్చెననియు నవి మృదుత్వము నొందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయించమని చెప్పెను. పార్వతి భర్త ఆజ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలువచ్చి ఆమెతో తలంటి నీళ్ళు పోయించుకుని వెళ్ళుచుండగా నామెపై దయదలచి పార్వతి సంపద నిచ్చెను. నాటినుండి ఆ పేదరాలు ధనవంతురాలై గుమ్మములోనికి వచ్చినవారికి పని చెప్పుచుండెను. ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు నామె భాగ్యము తీసివేయుటకు విఘ్నేశ్వరుని బంపగా అంత నామె వుండ్రాళ్ళు నైవేద్యము పెట్టెను. వాటిని తిని అతడు మరింత ఐశ్వర్యమామెకిచ్చి వెళ్ళిపోయెను. తరువాత పార్వతి నందిని బంపగా నతని కామె సెనగలు వాయనమిచ్చుటచే అతడుగూడా నామె భాగ్యములను తీయలేకపొయెను. పిమ్మట పార్వతి భైరవుని బంపగా నతని కామె గారెలు వండిపెట్టుటచే నాతడుకూడా నామె భాగ్యములను తీయలేక పోయెను. పిమ్మట పార్వతి చంద్రుని పంపగా నతని కామె చలిమిడి చేసి పెట్టుటచే నాతడనుభాగ్యమును హరింపలేకపోయెను. అటుపిమ్మట పార్వతి సూర్యుని పంపగా నతని కామె క్షీరాన్నము వండిపెట్టెను. అందుచేతనడునుగూడభాగ్యము హరింపలేకపోయెను. పిమ్మట అర్జునుని పంపగా ,ఆమె అతనికి అప్పాలు నైవేద్యము పెట్టుటచేత అతడు భాగ్యము హరింపలేకపోయెను. పిమ్మట శివునిపంపగా నతనికామె చిమ్మిలిపెట్టగా నాతడును కూడా భాగ్యములను హరింపలేకపోయెను. తుదకు పార్వతి వెళ్ళగా, ఆమెకు పులగము నైవేద్యముపెట్టెను. అంత పార్వతి ఆమె భక్తికి మెచ్చి " నీవు మాకందరకును బెట్టిన తొమ్మిది పదార్ధములను ఉద్యాపన చేసికొన్న యెడల మానవులకు సకలసంపదలు కలుగును" అని చెప్పి వెడలిపోయెను. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
బిందెతో ఐదు మానికలు అత్తెసరువేసి దానికి ఐదుమూళ్ళ అంగవస్త్రమును చుట్టి, బంగారు నందికి నైవేద్యముగ పెట్టి బంధువులకు వడ్డించవలెను.

14, ఏప్రిల్ 2016, గురువారం

స్త్రీలవ్రతకథలు : విష్ణు కాంత నోము కథ



విష్ణు కాంత నోము కథ

ఒక బ్రాహ్మణపడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయమైనపు డెపుడును ఆమె భర్తకు జబ్బుచేయుచుండెను. అట్లనేక సమయములందు ఆమె తమ్ముని వివాహ ప్రయత్నమున కాటంకమురాగా ఆమెభర్తకు జబ్బుచేయుటచే బంధువులు విసిగి పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అప్పుడామె భర్తకు ప్రాణమీదకు వచ్చెను. కానీ ఆమె అది లెక్కచేయకుండ భర్తనింట విడిచి తాను తమ్ముడి పెండ్లి చూచుటకు పుట్టింటికి పోవుచుండెను. దారిలో నొక విష్ణు కాంత చెట్టు పువ్వులు రాలియుండగా ఆమె వాటిని త్రొక్కుకొనుచు పోవుచుండెను. అంతలో విష్ణు కాంతము ’నోము నోచిన పూలను, కాలరాచిపోవుచున్న యువతిని చూడుడు, చెరువులోన చెంగలువలారా! యన్నమటలు విన్నవమ్మా విష్ణుకాంతా! కన్నావమ్మా విష్ణు కాంతా! ప్రియమైనభర్తకు ప్రాణంమీదకు వస్తే చాపనుచుట్టి నట్టింట బెట్టి చిన్న తమ్ముని పెండ్లి చూడ ప్రయాణమైన పడతిని చూస్తిమివింతగావుందో విష్ణు కాంతా’ యన్న మాటలు వినిపించినను, వాటిని లెక్క చేయకుండను, ఆమె ఆగకుండా పెండ్లికి వెళ్ళి తిరిగివచ్చుచు, విష్ణుకాంత దగ్గర ఆగి ముందన్న మాటలకు అర్ధమేమిటని అడిగెను. అప్పుడా వృక్షరాజు ఆమె పూర్వము విష్ణుకాంత నోమునోచి ఉల్లంఘించుటచే తమ్ముని పెండ్లి భర్త అనారోగ్యముగ నుండుట సంభవించెననియు, శుభకార్యములందనారోగ్యములు లేకుండట కానోమును తిరిగినోచి వాయనమియ్యవలెననియు తెలిపెను. ఆమె అట్లేయని నోము నోచుకొని ఏడాది ఐన తర్వాత ఉద్యాపనము చేసుకొని నిత్యకల్యాణము పచ్చతోరణముతో నుండెను.

ఉద్యాపన:
విష్ణు కాంతకు పదమూడు జోడుల నేతి గారెలను నైవేద్యముపెట్టి, ఇంకొక పదమూదు జతల నేతి గారెలను ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు : బచ్చల గౌరి నోము కథ



బచ్చల గౌరి నోము కథ
ఒక చిన్నది చక్కగా సంసారము చేసుకొనుచుందగా పండుగలకు తీసుకొను వెళ్ళుట కామె అన్న వచ్చెను. అన్న వచ్చెనని ఆనందముతో ఆ చిన్నది అన్ని పిండివంతలు తయారు చేసి పులుసు పోపునకు దొడ్డిలోనున్న కరివేపాకు తెమ్మని అన్నను పంపెను. అతడా చెట్టునెక్కు చుండగా పాము కరచినందున చనిపోయెను.యెంతకూ అన్న రాక పోవుటచూచి, అ చిన్నది దొడ్డిలోనికి వెళ్ళుసరికి చొంగలు కక్కుచు నతడు పడియుండెను. అది చూచి ఆమె "లబో దిబో" మని యేడ్చుచుండగా ఇరుగు పొరుగు అమ్మలక్కలు అక్కడకు చేరిరి. పార్వతీదేవి ఒక ముసలి దానివలె వచ్చి ఆమెతో "అమ్మయీ! యేడవకు ఇంటి లోనికి పోయి బచ్చలగౌరి నోమును నోచుకుని తరువాత వచ్చి మీ అన్నను పిలువుము. అతడు బ్రతుకగలడు." అని ఆ నోము ఉద్యాపనము జెప్పి మాయమైపోయెను. ఆమె ఆ ముసలిది పార్వతిదేవి యని గ్రహించి, ఆమెచెప్పిన విధముగా నోమునోచుకుని యన్నను పిలువగా నోము ఫలమున అతడు బ్రతికెను.అప్పటినుండీ వెన్ను చలవను స్త్రీలందరూ నోమును నోచుకుని అన్నదమ్ములతో అక్కాచెల్లెళ్ళతో ఆలుబిడ్డలతో, తోడికోడండ్రతో సుఖించుచుండిరి. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
వెండిబచ్చలకాయ నొకదానిని, బంగారుబచ్చలకాయ నొకదానిని చేయించి పూజ చెయవలెను. తరువాత నొక చీరను, రవికలగుడ్డను, బచ్చలిచెట్టును వెండిబచ్చలకాయను, దక్షిణ తాంబూలములను, ఒక ముసలి ముత్తైదువునకు వాయన మియ్యవలెను. శక్తి తగ్గినను ఫలము హెచ్చును.

స్త్రీలవ్రతకథలు : పొట్ట కదలని గౌరి నోము కథ



పొట్ట కదలని గౌరి నోము కథ

(దీనిని కడుపు కదలని గౌరి నోము అని కూడా అంటారు)

ఒక సోయయాజులవారికి ఒకత్తే కూతురు. ఆయన సంబంధాలు వెదకి నిరుపేదబ్రాహ్మణబాలునకిచ్చి ఆమెను పంపెను. ఆమె భర్త పేదవాడైనను పేదపండితుడు. ఆమె అతిభక్తితో నతనిని సేవించుచు, అత్తమామలయందు భక్తిచూపుచు కాలము గడుపుచుండెను. కొంతకాలమున కామెకు నెల దప్పెను. అందరూ సంతోషించిరి. కాని ఆమెకా గర్భము నిలువలేదు. అట్లే ఎన్నో పర్యాయములు ఆమెకు గర్భవిచ్ఛితిబ్రాప్తించెను. అందుచే నామెదుఃఖించుచు పార్వతీదేవిని తలచుకొని పుణ్యకార్యములను చేయుచు కాలము గడుపుచుండెను. అట్లుండగా నొకనాటియుదయమున పార్వతీదేవి ఒక వృద్ధబ్రాహ్మణి వలె నామె యింటికి వచ్చెను. సోమయాజులగారి కుమార్తె ఆమెను చూచి మిగుల గౌరవించి ఆనాటికి తమ యింటియందే భోజనము చేయవలసినదని వినయవిధేయలతో ప్రార్థించెను. ఆమె అందుకొండబడెను. భోజనమైన తర్వాత ఆ వృద్ధనారి సోమయాజులగారి కుమార్తెకు గర్భదోషమున్నదని తెలుపగా నామె దానికేమి చేయవలెనో సెలవీయవలసినదని అడుగగా నోము, ఉద్యాపనము తెలిపి వెళ్ళి పోయెను. తరువాత సోమయాజులగారి కుమార్తె ఆ నోము నోచి దబ్బపళ్ళవంటి కొడుకులను కని సంతోషముగా నుండెను.

ఉద్యాపన:
అయిదు శేర్లు బియ్యపు పిండితో ఇరువదిఐదు జిల్లేడుకాయలుచేసి, వాటిలోకొబ్బరి పూర్ణమును గాని లేక నువ్వుపప్పు పూర్ణమును గాని పెట్టి, పొట్టలు చెదరకుండా జాగ్రత్తగా వండవలెను. పిమ్మట వాటిని అయిదేసి హొప్పున ఐదుగురు ముత్తైదువులకు దక్షిణ తాంబూలములతో వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు : మాఘగౌరి నోము కథ



మాఘగౌరి నోము కథ
ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రికపుట్టెను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినంతనె వివాహము చేసెను. కాని ఆమె పెండ్లియయిన ఐదవనాడు విధవ అయ్యెను. ఆమె దుఃఖమును చూడలేక తల్లితండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తైదువులిద్దరు ఒక చోటును, విధవలందరూ ఇంకొక చోటును అయిదేసి పద్మములను పెట్టుకొని పూజ చేయుచుండిరి. అదిచూచి ఆ బ్రాహ్మణదంపతులు అది యేమని అక్కడవారిని అడిగిరి. పుణ్యస్త్రీలలో వృద్ధురాలి రూపంలో నున్న పార్వతీదేవి వారిని తనతో తీసుకువచ్చి, వారి కుమార్తెను స్నానం చేయించెను. చెరువులోని ఇసుకను దోసెడు తీసి గట్టు మీద వేయమని విధవ బాలికతో ననెను. ఆమె అట్లు చేయగా, నది పసుపయ్యెను. రెండవ సారికూడా నట్లే చేయగా, నది కుంకుమయ్యెను. మూడవపర్యాయము అటుల చేయగా నది కొబ్బరి యయ్యెను. నాల్గవమారు చేయగా నది బెల్లమయ్యెను. ఐదవ దఫా చేయగా నది జీలకర్రయయ్యెను. తరువాత నామె ఆ బాలవితంతువును మాఘగౌరి నోము నోచుకొనమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయెను. పిమ్మట తల్లితండ్రులామెతో మొదటి సంవత్సరము శేరుంబావు పసుపును, రెండవ యేట శేరుంబావు కుంకుమను, మూడవసంవత్సరము శేరుంబావు కొబ్బరిని, నాల్గవయేట శేరుంబావు బెల్లపు గుండను, అయిదవ యేట శేరుంబావు జీలకర్రను ముత్తైదువులకు వాయన మిప్పించి ముత్తైదువునకు తల్లంటి నీళ్ళు పోయించి ,భోజనము పెట్టించిరి. అయిదేళ్ళూ చేసిన తరువాత ఉద్యాపనము చేయగా నామె భర్త బ్రతికి వచ్చెను.

ఉద్యాపన:
ఈ నోము మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి మొదలు ముప్పది దినములు చేయవలెను. ప్రతిదినము స్నానముచేసి నీలాటి రేపులో పసుపు గౌరిని పెట్టుకొని, పసుపుతో ఐదు పద్మాలు, కుంకుమతో ఐదు పద్మాలు, పిండితో ఐదు పద్మాలు పెట్టుకొని పూజ చేయవలెను. ఈ విధముగా ఐదేండ్లు చేసిన తరువాత పసుపు గౌరిని నీటిలొ విడిచి ఐదుగురు ముత్తైదువులకు పైన చెప్పిన విధముగా వాయన మిచ్చి భోజనములు పెట్టవలెను.

స్త్రీలవ్రతకథలు : ధైర్య గౌరి నోము కథ



ధైర్య గౌరి నోము కథ

ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై భర్తతో కాపురమునకు వెళ్ళిననూ భయస్తురాలై యుండెను. ఆమెను పలుకరించినను, పని చెప్పినను యేడ్చుచుండెను. అదిచూచి ఆమెభర్తకు విసుగువచ్చి "నవ్వెడి మగవానిని యేడ్చెడి ఆడదానినినమ్మరాదని" అనుకొని ఆమెను పుట్టింటి దగ్గర వదిలి పెట్టెను. అందుచే నామెతల్లి తండ్రులు చాల పరితపించి భక్త వశంకరుడగు శంకరుని పూజించుచుండగా నొకనాడా స్వామి ముసలి బ్రాహ్మణ రూపమునవచ్చి ఆ యువతి పూర్వజన్మము నందు ధైర్యగౌరి నోము నోచి ఉల్లంఘన చేయుటచే ఈ జన్మలో నట్లు పిరికిపంద యయ్యెనని చెప్పి ఆ యువతితో ఆ నోము నోపించినచో ధైర్యము కల్గునని తెలిపి మాయమయ్యెను. తోడనే ఆమె తల్లితండ్రులాశ్చర్యపడి ,పరమేశ్వరుడే ఆనోము నోచుటకు ఆనతినిచ్చెనని సంతోషించి, తమ పుత్రికతో దానిని యధావిధిగా చేయించిరి. అప్పటినుండి ఆమె ధైర్య సంపన్నురాలయ్యెను. ఆ సంగతి ఆమె భర్త తెలుసుకొని సంతోషించి ఆమెను తన యింటికి తీసుకుపోయి సుఖముగా ఉండెను.

ఉద్యాపన:
తొమ్మిది గిద్దెల ఆవు నేతితో ఒక వరహా యెత్తు భమిడిపత్తితో వత్తిచేసి వెలిగించి పైకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను. ఐదు సోలలు ఆవు పాలలో అవసరమైనన్ని బియ్యం వేసి ,వండి ,దానిని నైవేద్యముగపెట్టి ఆ ప్రసాదమును ఇతరులకు ప్ర్ట్టకుండా తానే భుజించవలెను. ఈదీపమును భద్రపద ఆశ్వయుజ ,కార్తీక, మార్గశిర మాసములలో నెప్పుడైనను వెలిగించ వచ్చును. పధ్ధతి తప్పినను భక్తి తప్పకపోయినయెడల ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు : కరళ్ళ గౌరి నోము కథ



కరళ్ళ గౌరి నోము కథ
ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు, అయిదుగురు కోడళ్ళు వుండిరి. అతని ఆఖరి కోడలు కరళ్ళ గౌరి నోము నోచుకొనెను. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి , అత్త సొమ్ము వద్దు, మామసొమ్ము వద్దు, భర్తసొమ్ము వొద్దు, బిడ్డలసొమ్ము వొద్దు. నా సొమ్మే నాకిమ్ము అని సూర్యుని ప్రార్ధించుచుండెడిది. అది చూచి ఆమె యత్త మామలు, బావలు, మగడు, తోడికోడళ్ళు కోపగించుచుండిరి. అందుచే ఒక నాటి రాత్రి ఆమె నిద్రపోవుచుండగా వారామెను మంచముతో నేత్తుకొనిపోయి ఒక యరణ్యములో వదలిపెట్టి యింటికి పోయిరి. తెల్లవారగానే ఆమె లేచి తన దుర్దశకు దుఃఖించి, దిక్కులేని వారికి దేవుడే దిక్కనుకొని ప్రక్కచెరువులో స్నానముచేసి పూర్వము వలెనే సూర్యునమస్కారము చేసినవెంటనే ఆమె దోసిలి నిండావరహాలు పడినవి. ఆమె వాటిని దీసుకొని ప్రక్కగ్రామములోకావలసిన వస్తువులన్నింటిని కొనుకొని, సుఖముగ ఒక యింటిలో కాపురము వుండెను. కాని ఆమె అత్తవారింటిని వదలి వచ్చినది మొదలు వారందరు దరిద్రులైపోయిరి. ఒకనాడు వారాయడవిలో కట్టెలు కట్టుకొనుటకు వచ్చి సూర్యనమస్కారము చేయుచున్న చిన్న కోడలిని చూచి గురుతుపట్టి తమ తప్పును క్షమింపమని కోరిరి. ఆమె కూడా వారి దుఃస్థితికి విచారించి మిక్కిలి ఆదరమున వారినందరినీ మన్నించెను. ఆమె పట్టిన నోమును అత్తవారు, తోటికోడళ్ళు పట్టి అంత సుఖముగా ఉండిరి. ఈ కథ ప్రతిదినము చెప్పుకొని అక్షతలు వేసుకొని యేడాది నిండిన తర్వాత ఉద్యాపనము చేసుకోవాలి.

ఉద్యాపన: 
యేడాది నిండిన తర్వాత ఒక క్రొత్త కంచములో పదమూడు కరళ్ళు పెట్టి చీర , రవికేలగుడ్డతో ముత్తైదువులకు వాయన మియ్యవలెను. భక్తి తప్పకుండిన ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు : గుమ్మడిగౌరినోము కథ


గుమ్మడిగౌరినోము కథ
ఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లయిన ఐదవనాడు మృత్యువు వున్నది. ఆ సంగతి తెలియక తల్లితండ్రులతనికి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన ఐదవ దినమున యమదూతలు అతని ప్రాణములను తీసుకుపోవుటకు వచ్చిరి. వారిని ఆతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను తీసుకొని అడవి మార్గమున పరుగెత్తుచుండెను. యమభటులను తప్పించుకొనవలెనని ఆ అమాయకురాలు చేయుచున్న ప్రయత్నమునకు నవ్వుకొని పార్వతీదేవి ఒక వృద్ధ స్త్రీవలె వచ్చి "అమ్మాయీ! మగనివెంట వేసుకొని ఎక్కడికి యెగబడిపోవుచున్నావు?" అని అడిగెను. అందుకా చిన్నది "దొడ్డమ్మా! నాభర్త ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చినారు. నేనీ అడవిలోనున్న పార్వతీదేవి ఆలయమున కేగి ఆమెను ప్రార్ధించి పతిభిక్షను తెచ్చుకొనవలయునని పోవుచున్నాను" ననెను. అప్పుడామె ఆ చిన్నదానితో గుమ్మడి గౌరి నోము నోపించి, ఉద్యాపనము చేయించి, వాయనము పుచ్చుకొని ఐదవ తనమును ప్రసాదించెను. పిమ్మట ఆమె భర్త మృత్యువుబారినుండి రక్షింపబడెను.

 గుమ్మడిగౌరినోము నోచిన కాంత కాంతునకు పూర్ణాయుర్దాయము కలుగును.

ఉద్యాపన: 
ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని మూడు గుమ్మడిపండ్లను రవికెలగుడ్డ, పసుపు, కుంకుమలతో ఉంచి ఒక ముసలి ముత్తైదువునకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.

12, ఏప్రిల్ 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు - రేగులగౌరి నోము కథ



రేగులగౌరినోము కథ

ఒక మహారాజునకు   సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య  ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు "అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు" అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి  వైష్ణవ రూపమున అక్కడకు వచ్చి"అమ్మా! నీవు చేసిన తప్పుకు భగవంతుని నిందించెదవేల? రేగులగౌరి నోము నోచి ఉద్యాపనము మరచిపోయితివి. అందుచే నీకు సంతానప్రాప్తి కలుగలేదు. ఇప్పటికైన మించినదిలేదు. ఆ నోము నోచుకొనుము" అనెను. అందుకామె, స్వామి! అదెట్లు నోచవలయనో సెలవొసంగుడు యని ప్రార్ధింప నతడు "అమ్మా ! రెండున్నర సోలల బంగారు రేగుపండ్లు చేయించి, దక్షిణ తాంబూలములతో వాటినొక బ్రాహ్మణునకు వాయన మియ్యవలయునని" చెప్పి వెడలిపోయెను. ఆ ప్రకారముచేసి సంతానమును పొంది సుఖముగా నుండెను.

ఉద్యాపన:
ఈ కథను చెప్పుకని యేడాది పొడుగున అక్షతలు వేసుకొనవలయును.ఆ తరువాత తొమ్మిది తవ్వల రేగుపండ్లలో నొక బంగారు రేగుపండు వేసి ఒక ముసలి బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు - చల్ల చిత్త గౌరి నోము కథ


చల్ల చిత్త గౌరి నోము కథ

చల్లచిత్తనోముచిత్త మారగ జేసి ఇల్లు వాకిళ్ళతో ఈశ్వర చింతతో చల్లనిబ్రతుకుతో సౌభాగ్యలక్ష్మితో, ఉల్లసంబుతోడ, నుండవే తల్లీ.

ఈ మాటలనుకొని అక్షతలు వేసుకొనవలెను. చల్లచిలుకునప్పుడు కండ్లకంటుకొనిన చల్లబొట్లతో పసుపు కలిపి ప్రతిదినము ఐదుగురు పుణ్యంగనలకు బొట్లు పెట్టవలెను. అట్లు నూట పదియైదు దినములు చేసిన పిమ్మట ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన:
దక్షిణ, తాంబూలములతో ఆనాటి చల్లను, వెన్నను పేరంటాలికి వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు - సహస్రఫలముల నోము కథ



సహస్రఫలముల నోము కథ

ఒకనాడు పార్వతి శివుని నాథా! ఎల్లకాలము చేయు నోము వ్రతమేదని యడుగగా, ఆ స్వామి పార్వతీ! సహస్ర ఫలముల నోము ఎల్లకాలము చేయదగిన నోము. ఆ నోము చేసిన స్త్రీకి సర్వదేవతల దయయు కొంగు బంగారమైయుండునని చెప్పెను.

ఈ కథను చెప్పుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపన చేసుకొనవలెను.

ఉద్యాపనము:
వేయి రకముల పండ్లు రకమునకొక వేయి చొప్పున యేరుకొని యవి వచ్చు కాలములో తగిన దక్షణలతో వేయిమంది దంపతులకు ఇచ్చుచుండవలెను. ఒకే రకము పండ్లను, ఇచ్చినవారికి మరల యివ్వరాదు.

స్త్రీలవ్రతకథలు - కందగౌరీనోము కథ




కందగౌరీనోము కథ
ఒక రాజునకు లేక లేక ఒక కూతురు కలిగెను. ఆమె పుట్టినది మొదలుపోరుపెట్టుచుండెను. ఆ పోరు రాను రాను యేడ్పుగామారెను. ఆ రాచ బిడ్డ పెద్దదైనప్పటికీ యేడుపు మానలేదు.ఆమెను గూర్చి ఆ ఊరి ప్రజలు చెప్పుకొనుచుండిరి. అది సహించలేక రాజు ఆమెచే పార్వతీ పూజను చేయించగ ఒకనాడు పార్వతీదేవి ఆతని కలలో కనిపించి నీకుమార్తె  పూర్వజన్మముున కందగౌరి నోము నోచి ఉల్లంఘించినది. అందుచేత ఈ జన్మలో జీవితమంతాదుఃఖపూరితమయ్యెను. ఆమె యేడుపు పోవుటకు కందగౌరీనోము నోపింపుడు, అని చెప్పి అంతర్ధానమయ్యెను. తెల్లవారి మేల్కొనునంతనే అతడు తన కుమార్తెతోఆ నోము నోపించెను. అప్పటినుండి ఆమె కంటికి నీరులేక,కష్టమను మాటలేక కలకాలము సుఖముగా ఉండెను.
ఉద్యాపనము
ఈ కథ చెప్పుకొని యేడాదిపొడుగున అక్షతలు వేసుకొని ఉద్యాపనము చెసుకొనవలెను. వెండిదుంప, ఒక బంగారుదుంప చేయించి వీశేయేబులము కందదుంపలను దగ్గర పెట్టి నల్లపూసలు, లక్కజోడు, తామ్బూలములు కలిసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

స్త్రీలవ్రతకథలు - గండాల గౌరి నోము కథ




గండాల గౌరి నోము కథ
ఒక ఊరిలో ఒక రాజుకూతురు ,మంత్రికూతురు గలరు. రాజకూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధముల ఎక్కువైనది. కాని మంత్రి కూతురుకన్న  ఘనత ఆమెకు లేదు. మంత్రికూతురు ధన, ధన్యాలకు, దాంపత్యమునుకు, పాడి పంటలకు, మణులవంటి బిడ్డలకు నిలయమై సుఖముగా నుండెను. కాని రాజకుమారి గండాలపాలై, కష్టాల కలికియై ఆపదల కాలవాలమై బాధపడుచుండెను. తనకన్న అన్ని విధముల తక్కువగా నుండవలసినమంత్రి కుమార్తె సుఖముగా నుండుటయు, తాను గండాలతోనిండుటయు తలచి ఆమె పార్వతి పూజలు ప్రారంభించగా, ఆ దేవికి దయ కలిగి, ఆమెకు ప్రత్యక్షమై    గండాల గౌరి నోము నోచుకొనమని ఆనతి ఇచ్చెను. రాజపుత్రిక ఆ నోమును నోచుకుని సకల సంపదలతో, నిత్య కల్యాణముతో, పచ్చతోరణముతో గండాలను గడచి సుఖించెను. అప్పటినుండి ప్రజలు ఆ కథను చెప్పుకొని అక్షతలు వేసుకొని, నోమును నోచుకొని గండములు లేక జీవించుచుండిరి. ఈ కథను చెప్పుకొని అక్షతలు ఏడాది పొడుగున  వేసుకొనవలెను.
ఉద్యాపన
ఐదు శేర్ల నువ్వులపప్పుతో చిమ్మిలి చేసి విడి విడిగా మూడేసి వుండలు కట్టవలెను.  తర్వాత పదమూడు జతల తక్కెడు చిప్పలు తెచ్చి, పదమూడు చిప్పలలోను ఒక్కొక్క చిమ్మిలి ముద్దనుంచి, మిగిలిన చిప్పలను  వాటిమీద మూతవేయవలెను. పిమ్మట ఒకదానిని నైవేద్యముగ పెట్టి మిగిలిన పన్నెండు చిప్పలను పన్నెండుగురు పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలములతో వాయన మియ్యవలెను, నైవెద్యములు తాను తరువాత భుజించవలెను.

స్త్రీలవ్రతకథలు - కన్నెతులసమ్మ నోము కథ



కన్నెతులసమ్మ నోము కథ 

ఒక చిన్నది సవితితల్లిపోరు పడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెను. సవతితల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించెను . కాని అతడందుకు అంగీకరింపక, ఆమెనే వెళ్ళిపిల్లను తీసుకురమ్మని చెప్పెను . ఇంక చేయునది లేక ఆమె సవతి పిల్లను తీసుకునివచ్చుటకాపిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె తాత నడిగెను. ఎంతో నిష్టూరముమీద ఆ పిల్లను తీసుకువచ్చెను. ఒకనాడు పిల్లకు తన పిల్లనిచ్చి ఎత్తుకొనమనిచెప్పి అరిశముక్కను పెట్టి ఆమె తులసమ్మకు పూజ చేసుకొనెను. అది చూచి పిల్ల సవతితల్లి వెళ్ళిన తరువాత అరిసెముక్కను నైవేద్యము పెట్టి తులసమ్మకు పూజించెను . ఆ చిన్నదాని భక్తికి మెచ్చిన తులసమ్మ ప్రత్యక్షమై "చిన్నదానా! నీవు పూర్వ జన్మలో కన్నెతులసమ్మ నోము నోచి ఉల్లంఘించుటచేత ఈజన్మలో నీకు తల్లిలేకపోయినది. అందుచేత నీవు కష్టములు పడవలసివచ్చినది. కావున నీవానోమునునోచుకొని సుఖపడుము" . అని సెలవిచ్చి మాయమయ్యెను . ఆ పిల్ల ఆ నోము నోచు కొని ఏడాది అయిన తరువాత ఉద్యాపనము చేసుకొనెను. అప్పడినుండి ఆమె సవతి తల్లి కామె యందు ప్రేమ కలిగి ఆమెను సోత బిడ్డవలె చూచుకొనెను .

ఉద్యాపన:
తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజ చేసి ఒక కన్యకు తలంటి నీళ్ళుపోసి పరికిణి , రవికె యిచ్చి అరిసెలు వాయన మియ్యవలెను .

స్త్రీలవ్రతకథలు - పెండ్లిగుమ్మడిగౌరి నోము కథ

పెండ్లిగుమ్మడిగౌరి నోము కథ
పెండ్లిగుమ్మడినోము పెద్దక్కనోచింది గొల్లమందతోటి గొప్ప పంటతోటిబిడ్డ ఆటలతోటి పెద్ద దిక్కు తోటి , వడ్లగరిసెలతోటి , శుభ కార్యములతోటి నిత్యకల్యాణాల నెగడందుచుండెను.
ఉద్యాపన:
మూడుగుమ్మడి పండ్లను తెచ్చిఒక దానిని మానెడుసోలెడుబియ్యముతో బ్రాహ్మణునకు వానిఇంటి దగ్గర దానమిచ్చి తాను పెండ్లి గౌరి నోము నోచిఇచ్చెడి వాయనమును పుచ్చుకొనుటకు ఆయననుతన ఇంటికిరమ్మనవలెను. అతను వచ్చిన పిమ్మటరెండవపండును అడ్డెడు తవ్వెడు బియ్యముతో దక్షిణ తాంబూల సహితమగ నిచ్చి నమస్కరించవలెను. తరువాత మూడవ పండును ఐదు శేర్ల బియ్యమును స్వయంపాకముతో పట్టుకొనివెళ్ళి ఆ బ్రాహ్మణుని భార్యకిచ్చి ఆనాడచట భోజనముచేయవలెను

స్త్రీలవ్రతకథలు - చిట్టిబొట్టు నోము కథ

 
చిట్టిబొట్టు నోము కథ 
చిట్టిబొట్టును నోచవలె- శ్రీమంతుల బిడ్డయి పుట్టవలె
తోబుట్టువులతోడతులతూవలె , దొడ్డమగనికి వనిత కావలె
మాఘపూర్ణిమ ముందొచ్చు రథసప్తమినాడీ మాటలను అనుకొని అక్షతలు వేసుకొనవలెను. పిమ్మట ప్రతిదినము అయిదుగురు పుణ్యస్త్రీలకు బొట్టుపెట్టవలెను. ఆమె మున్నూట అరువదియైదు దినములు చేసిన పిమ్మటఉద్యాపనము చేసుకొనవలెను .

ఉద్యాపన:
బంగారు బొట్టు చేయించుకొని,ఐదుగురు ముత్తయిదువులకు తలంటినీళ్ళు పోసి బొట్టు పెట్టి భోజనములు పెట్టి ఐదుగురికి  రవికెల గుడ్డలు , తాంబులమును  యివ్వ వలెను.

5, ఏప్రిల్ 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు - పువ్వులతాంబూలము నోము కథ


పువ్వులతాంబూలము నోము కథ

ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త  వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెకును "అని
చెప్పెను . తెల్లవారిన తరువాత  ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక  తాంబూలములో ఐదుపువ్వులు పెట్టి ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని  సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన :
  ఒక బంగారు పువ్వును పళ్ళెములో పెట్టి ఆ పళ్ళెము నిండుగా నీరు పోసి  చీర , రవికెలగుడ్డ పెట్టి పేరంటాలునకు పార్వతీదేవి పేరున వాయనము ఇవ్వవలెను.

స్త్రీలవ్రతకథలు - గంధతాంబూలము నోము కథ


గంధతాంబూలము నోము కథ
ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త  వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెకును "అని
చెప్పెను . తెల్లవారిన తరువాత  ఆమె నోము నోచుకొని ప్రతిదినము ఒక  తాంబూలముతో ఐదు గంధపు ఉండలను  ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని  సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన :
ఒక ముత్తైదువునకు చీర , రవికెలగుడ్డ , ఆకులు , పోకలు , గంధపుఉండలు  , దక్షిణ వాయనమీయవలెను.

స్త్రీలవ్రతకథలు - నిత్య తాంబూలము నోము కథ


నిత్య తాంబూలము నోము కథ

ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త  వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెక్కును"అని   
చెప్పెను . తెల్లవారిన తరువాత  ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలమును ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని  సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన:
బంగారపు ఆకులు , వెండి చెక్కలు కలిపి తాంబూలములతో బ్రాహ్మణునకియ్యవలెను .