గ్రహణగౌరినోము కథఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు ఒక కూతురు ఉండెను. ఆ పిల్ల దురదృష్టవశముచే పుట్టినది మొదలు పగలు పిల్లగను, రాత్రి పురుగులగను అగుచుండెడిది. తల్లి రాత్రులంతా పురుగులనన్నింటినీ పోగుచేసి కాపాడుచుండగా, తెల్లవారుసరికి ఆ పురుగునన్నీ చేరి పిల్లగనగుచుండెను. అట్లుండగా ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళవలెనని వచ్చెను. కాని ఆమె బిడ్డ పరిస్థితి బయల్పడకుండా కాపాడ దలచి, పుట్టింటికి వెళ్ళలేదు. అట్లనేక పర్యాయములు ఆమె పుట్టింటికి వెళ్ళకుండ ఉండెను. కాని పండుగ ముందామె పెద్దన్నగారు వచ్చి పట్టుదలతో తీసుకొని వెళ్ళదలచెను. అందుచే ఆమె చేయునది లేక 4గురు కోడండ్రను బిలిచి కుఱ్ఱవాళ్ళను, తాను వచ్చువరకు చూడవలసినదని కోరెను. పెద్ద కోడండ్రు ముగ్గురూ అందుకు అంగీకరించలేదు.చిన్న కోడలు ఒప్పుకొనెను. అప్పుడామె చిన్నకోడలితో తన కూతురు రహస్యమును చేప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంటదగ్గర ప్రక్కవేసి ఒక్క పురుగైన చెదరకుండా వానిని లోనికి ప్రోగుచేసి కాపాడవలెనని బహు రహస్యముగా చెప్పి పుట్టింటికి వెళ్ళెను. ఆ చిన్న కోడలుతన వాగ్దానము ప్రకారము ఆ బిడ్డను కంటికి రెప్పవలె కాపాడుచు, రాత్రులందు భర్త దగ్గరకైన వెళ్ళకుండా ఉండెను. అట్లు నాలుగు దినములు గడిచెను. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించి, ఐదవనాడు అటుక మీద కూర్చుండి భార్యను కనిపెట్టుచుండెను. చీకటిపడిన వెంటనే అతడు పిల్ల పురుగులుగా మారుటకు వాటినన్నింటినీ తన భార్య గుంటలోకి ప్రోగుచేయుచు, రాత్రంతయు నిద్రలేకుండా యుండుటయు చూచి అతడా రహస్యమేమని భార్యనడిగెను గాని రహస్యమేమో ఆమెకు తెలియలేదు. అందుచేత అత్తగారి ఆజ్ఞను మాత్రమతనికి తెలిపెను. అది విని ఆ రహస్యమును గ్రహించవలెనని గట్టి పట్టుదలతో నాతడు అరణ్యమునకు బోయి తపస్సుచేయ మొదలిడెను. అంతలో నాత్రోవను బోవుచున్న పార్వతీ పరమేశ్వరులు తన తపస్సునకు కారణమేమని యడుగగా నతడు తన నిశ్చయమును తెలిపెను. అప్పుడు పార్వతి "ఓ చిన్నవాడా! నీ చెల్లెలు పూర్వజన్మమందు రజస్వలై ఆ దోషమును ఇంట కలిపెను. ఆ పాపఫలముగా నామె యీ జన్మమున రాత్రివేళ పురుగులగుచున్న "దని చెప్పెను. అది విని యతడు తల్లీ! ఆమె కాపీడయెట్లుతొలగునో సెలవిమ్మని పాదములు మీద వ్రాలెను. ఆమె దయతలచి "నాయనా ! నీ చెల్లెలితో గ్రహణ గౌరీ నోము నోపించుము. అప్పుడామె కాపీడ తొలగ గలదు" యని చెప్పి అదృశ్యమైనది. ఆ చిన్నవాడు సంతోషముతో గృహమునకు వచ్చి చెల్లిలితో ఆనోము నోపించగా నామెయు దోషరహితయై రాత్రింబవళ్ళు బాలికరూపము నందెను, అంతలో ఆతని తల్లిపుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్నకోడలి దగ్గరనుండి కూతురిని తీసుకుని పోయెను. ఆ రాత్రి బిడ్డ పురుగులగా మారకుండుటకాశ్చర్యపడి, కోడలికి ఆ విషయమును తెలుపగా, నామెకంతకు పూర్వము జరిగిన విషయమును తెలిపెను. అంత కోడలి విశ్వాసమునకు , కొడుకు పట్టుదలకు పార్వతీ దేవి దయకు సంతోషించి అందరితో సుఖముగా నుండెను.
ఉద్యాపన: సూర్యగ్రహణము పట్టిన క్షణము పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రత్తి, బెల్లం, ఆకు పోక పందిరిలో పెట్ట వలెను. గ్రహణము విడిచినంతనే వాటిని యింటిలో పెట్టవలెను. ఆ తరువాత రోజునుండి తొమ్మిది రోజులవరకు గౌరిని పూజించవలెను. తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు చేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి, తొమ్మిది అట్లు నైవేద్యము పెట్టవలెను. ఆఖరి రోజున ఆకులు, పోకలు, అట్లు క్రొత్తజల్లెడలోపల పెట్టి పాతజల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.